Social News XYZ     

Public awareness is need on fire accidents: Amala Akkineni

అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ఎంతో అవసరం
- శ్రీమతి అమల అక్కినేని

Public awareness is need on fire accidents: Amala Akkineni

Public awareness is need on fire accidents: Amala Akkineni (Photo:SocialNews.XYZ)

1944 సంవత్సరం ఏప్రిల్‌ 14న ముంబాయిలోని డాక్‌ యార్డ్‌లోని షిప్‌ జరిగిన అగ్నిప్రమాదంలో ప్రజల్ని కాపాడే క్రమంలో 66 మంది ఫైర్‌ ఫైటర్స్‌ ప్రాణాలు కోల్పోయారు. వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ ఫైర్‌ స్టేషన్‌లో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీమతి అమల అక్కినేని హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ సురేష్‌రెడ్డి, డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డి, ఫిలింనగర్‌ ఫైర్‌స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ వి.సత్యానంద్‌తోపాటు ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది, ఫిలింనగర్‌ వాసులు పాల్గొన్నారు.

 

ముందుగా విధి నిర్వహణలో అసువులు బాసిన ఫైర్‌ ఫైటర్స్‌కి శ్రద్ధాంజలి ఘటించారు శ్రీమతి అమల అక్కినేని. అనంతరం అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ఫైర్‌ సిబ్బంది ఉపయోగించే పరికరాలను పరిశీలించారు. అసిస్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ సురేష్‌రెడ్డి ఆయా పరికరాలను ఎలా, ఎందుకు ఉపయోగిస్తారనేది వివరించారు. ఆ తర్వాత ఫైర్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు అమల అక్కినేని. అనంతరం జరిగిన కార్యక్రమంలో వారోత్సవాలకు సంబంధించిన వివిధ రకాల పాంప్లెట్స్‌ను, పోస్టర్స్‌ను శ్రీమతి అమల అక్కినేని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీమతి అమల అక్కినేని మాట్లాడుతూ ''డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్స్‌కి, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌కి, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రారంభమవుతున్న అగ్నిమాపక వారోత్సవాలకు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ప్రజల్లో అగ్ని ప్రమాదాల గురించి, ఫైర్‌ ఫైటర్స్‌ గురించి అవగాహన తీసుకు రావడం చాలా అవసరం. ఈమధ్య మా అన్నపూర్ణ స్టూడియోస్‌లో కూడా ఒక ట్రైనింగ్‌ జరిగింది. ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి అందరూ వచ్చారు. మా ఎంప్లాయీస్‌, అన్నపూర్ణ ఫిల్మ్‌ స్కూల్‌ విద్యార్థులతోపాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఫైర్‌ ఫైటర్స్‌ కష్టాలేమిటో అప్పుడు నాకు అర్థమైంది. ఒక్క నిమిషంలో ఫైర్‌ ఎంత స్పీడ్‌గా స్ప్రెడ్‌ అవుతుంది. ఎంత నష్టం కలిగిస్తుంది అనేది అప్పుడే నాకు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల గురించి అవగాహన చాలా అవసరం. ఈ కార్యక్రమం సంవత్సరం అంతా జరగాలని, మీకు అందరూ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా పగలు, రాత్రి కృషి చేస్తున్న ఫైర్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌కి అభినందనలు. నాగార్జున తరఫున, అన్నపూర్ణ స్టూడియో తరఫున, మా కుటుంబం తరఫున, నా తరఫున ధన్యవాదాలు'' అన్నారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ''మేము అన్నిరకాల విపత్తుల నుంచి ప్రజల్ని, జంతువులను కాపాడుతూ ఉంటాం. ఈమధ్య ఒక పక్షిని కూడా కాపాడి బ్లూ క్రాస్‌కి పంపించడం జరిగింది. ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన అమలగారికి మా స్టేషన్‌ సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం'' అన్నారు.

అసిస్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ ''ఎంతో బిజీ షెడ్యూల్‌లో కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన బ్లూ క్రాస్‌ ఫౌండర్‌ అండ్‌ ఛైర్మన్‌ అమలగారికి కృతజ్ఞతలు. 1944లో ఇదే రోజున ముంబయిలోని ఒక డాక్‌ యార్డ్‌లోని షిప్‌లో ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. అందులోని వారిని కాపాడే క్రమంలో 66 మంది ఫైర్‌ ఫైటర్స్‌ చనిపోయారు. అందుకే ప్రతి సంవత్సరం వారి జాపకార్థం ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు అగ్నిప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలా నివారించాలి, ప్రమాదం జరిగినపుడు దాని నుంచి తమని తాము ఎలా కాపాడుకోవాలి అనే విషయాల్ని ఈరోజు విడుదల చేసిన ఈ పాంప్లేట్స్‌ని అందరికీ పంచుతూ వివరిస్తాం'' అన్నారు.

డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ''ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అగ్నిమాపక వారోత్సవాలు జరుపుతున్నాం. ఫైర్‌ యాక్సిడెంట్‌ అనేది ఎక్కడైనా జరగొచ్చు. అందుకే ఈ వారం రోజులు అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు మా వంతు కృషి చేస్తాం. అంతేకాదు. మీ ఏరియాలకి వచ్చి అవగాహన సదస్సు చెయ్యడానికి కూడా మేం ముందుంటాం'' అన్నారు.

ఈ కార్యక్రమంలో ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది తరఫున ఒక మెమంటోను శ్రీమతి అక్కినేని అమలకు బహూకరించారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్‌ వి.సత్యానంద్‌ను శాలువాతో సత్కరించారు.

Facebook Comments

%d bloggers like this: