మీ అమూల్యమైన ఓటు విలువ వివరించిన దర్శక నిర్మాత వై.వి.ఎస్.చౌదరి
Listen:
నమస్కారమండీ..
నేను మీ వై.వి.ఎస్. చౌదరిని. మీతో కొంచెం మాట్లాడాలండీ..
ఓరోజు నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నానండీ.. ఆ పక్కనే ఒక నిరాహారదీక్ష టెంట్‌లో ఒక మనిషి చివరి క్షణాల్లో ఉన్నాడు. అతనెవరో కూడా నాకు తెలీదు. పిలిచాడు. దగ్గరికెళ్లాను. ఒక వెయ్యి రూపాయలు నా చేతిలో పెట్టి.. ‘దేశానికి పనికొచ్చే ఓ మంచి పని చెయ్యండీ’ అని చివరిమాటగా చెప్పి చచ్చిపోయాడండీ! ఇప్పుడు చెప్పండి! ఆ డబ్బుతో నేనేం చెయ్యాలి? నేను మందు తాగటానికి ఖర్చు పెడితే మీరు నన్నేమంటారు? బండ బూతులు తిట్టాలన్నంత కోపం వస్తోంది కదా! అదే పని మీరు చేస్తే మిమ్మల్ని కూడా నేనూ అలాగే తిట్టాలిగా?.. అర్థం కాలేదా? స్వతంత్య్రం కోసం లక్షమందికి పైగా రోడ్ల మీద చనిపోతే, మనకీ ఓటు హక్కు వచ్చిందండీ! దాన్ని మందుకోసమో, మతం కోసమో, కులం కోసమో నాలుగు డబ్బుల కోసమో వాడేస్తే దాన్నేమనాలి? అంతకంటే నీచమైన పని ఉంటుందా?
అమ్మా.. అన్నా.. ఈ ఓటు మనకిచ్చింది మన కులం వాళ్ళు మాత్రమే కాదు.. మాల, మాదిగ, కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య ఇలా దేశంలో ఉన్న అన్ని కులాల వాళ్లు కలిసి చనిపోతే ఈ ఓటు హక్కు మనకు వచ్చిందండీ! దీన్ని ఏ ఒక్క కులం కోసమో ఎలా వాడతాం? వాళ్లిచ్చింది దేశం కోసం. అది వాడాల్సిందీ దేశం కోసమే.
బాగా ఆలోచిస్తే మధ్య తరగతిలోనూ, దిగువ మధ్యతరగతిలలో మాత్రమే ఈ కులాల గోల ఇంకా ఉంది. కానీ.. ఒక్కసారి మధ్య తరగతికి పైన వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే.. విజ్ఞత వల్లనో, అవసరాల వల్లనో కులాల ప్రసక్తే పక్కన పెట్టేశారు వాళ్ళు. మీకు తెలిసిన సెలబ్రిటీల ఫ్యామిలీలలో ఏదైనా ఒక ఫ్యామిలీని ఉదాహరణగా తీసుకోండి! పెళ్లి విషయాల్లో కానీ, స్నేహం విషయాల్లో కానీ.. కులాలను పక్కన పెట్టేశారు వాళ్ళు. అలా కులాలను వదిలేసిన వాళ్ల కులాలను ఆదర్శంగా తీసుకొని, ఆ కులాల కోసం మీరు కొట్టుకుంటున్నారు. ఇది ఏ మాత్రం కరక్టో ఒక్కసారి ఒక్కసారి మీరే ఆలోచించుకోండి!
ఏమండీ.. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోడానికి ఓ ‘గార్డియన్ కావాలి’ అని అనుకుందాం! ఆ పని ఓ అయోగ్యుడికి, ఓ అసమర్ధుడికీ లేదా ఓ నేరస్తుడికీ అప్పగిస్తామా? అలాంటి వ్యక్తి మీద ఓ చిన్న అనుమానం ఉన్నా దగ్గరికి రానియ్యమే! అలాంటిది.. అయిదేళ్ల పసిబిడ్డ మన ఆంధ్రప్రదేశ్! ఆలోచించండి. ఒకాయన మనకి తెలుసు. ఆయన్లో మంచి, చెడు కూడా మనకి బాగా తెలుసు. ఆయనకివ్వాలా? ఏం చేస్తారో తెలియని మరొకరికో, ఇంకొకరికో, వేరెవరికో ఇవ్వాలా?
కొంతమంది ‘ఒక్కసారేగా! ఇచ్చి చూద్దాం’ అంటున్నారు. ఈ ఒక్కసారి ఇచ్చి చూద్దాం అనే ఆలోచన అభివృద్థి చెందిన రాష్ట్రానికి పనికొస్తుందేమో కానీ.. అడుగుల నేర్చుకునే దశలో ఉన్న రాష్ట్రానికి పనికి రాదండీ! పసిబిడ్డ మీద ప్రయోగం చెయ్యకూడదండీ! ఏ బిడ్డకైనా చిన్నతనంతోపాటు ఆరేళ్ల నుంచీ పదిహేనేళ్ల వరకూ ఎదిగే ఎదుగుదల చాలా కీలకమండీ! మరి ఆ కీలకమైన జీవితమే తప్పటడుగుల్లో పడితే, జీవితాంతం సరిదిద్దుకోలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుంది ఆ బిడ్డ భవిష్యత్తు. అర్థం చేసుకోండి! మన రాష్ట్రం.. ఐదేళ్ల పసిబిడ్డ అనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి!
ఏం? ఏ రాజకీయ పక్షమైనా ప్రతిపక్షంలో ఉండి పని చెయ్యొచ్చుగా? ప్రతిపక్షం ప్రజాసేవ కాదా? అధికారపక్షం నడిపిస్తుంది. ప్రతిపక్షమే ఆ దారిలో ఉన్న తప్పుల్ని చూపిస్తుంది, సరిచేస్తుంది. ప్రజాస్వామ్యానికి అధికారపక్షం ఎంత అవసరమో.. ప్రతిపక్షం కూడా అంతే అవసరం. అలాంటి ప్రతిపక్షం మీదే గౌరవం లేని ఏ రాజకీయ పక్షమైనా అధికారానికి ఎలా పనికొస్తుంది? అనుమానాలు రావా? ఆ మాత్రం కూడా మనం ఆలోచించలేమా? చెప్పండి!!
కొంతమంది అంటుంటారు.. ‘ముఖ్యమంత్రి ఎవరైనా పర్లేదండీ. మా ఎమ్మెల్యే కోసం ఓటేస్తాం’ అని. తప్పండీ.. మీ ఓటు మీ ఎమ్మెల్యే దగ్గరే ఆగిపోదు. అదే ఆ పార్టీని అధికారంలోకి తెస్తుంది. ముఖ్యమంత్రి చెడ్డవాడైతే మీ ఎమ్మెల్యే కూడా ఏమీ చెయ్యలేడండీ! అదే.. ముఖ్యమంత్రి సమర్థుడైతే ఆ ఎమ్మెల్యేలో తప్పులున్నా సరిదిద్దుతాడు, సరిజేస్తాడు. ముఖ్యమంత్రి కోసం ఓటెయ్యండి. ‘జలం కోసం, జనం కోసం’ ఓటెయ్యండి. కులం కోసమో, నాలుగు కాగితాల కోసమో దాన్ని వృధా చేయకండి!
ఇప్పుడు మనం ఓటెయ్యాల్సింది అభ్యర్ధులకి మాత్రమే కాదు. మన రాష్ట్రంకోసం, మన రాజధానికోసం 33000 ఎకరాలు తృణప్రాయంగా త్యాగంచేసిన అన్నదాతలకి ఓటెయ్యాలి. వాళ్ల నమ్మకాన్ని, వాళ్ళ భవిష్యత్తుని గెలిపించాలి. వాళ్లకి అన్యాయం జరిగితే, మనం వేసిన ఓటు ఆ అన్యాయానికి కారణమైతే, ఆ భగవంతుడు కూడా మనల్ని క్షమించడు. ఒక్కటి గుర్తుంచుకోండి. రైతుకి పొలం ప్రాణంతో సమానం. రాజధానికోసం ౩౩౦౦౦ ప్రాణాలను పణంగా పెట్టిన రైతుసైనికుల త్యాగాలను గౌరవించటం, వాటికి విలువనివ్వటం మన బాధ్యత, మన కర్తవ్యం..
ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే.. సామాన్యుడు కూడా ఆ ప్రభుత్వ తప్పొప్పుల్ని ఎంచటమే కాక, ఆ తప్పుల్ని బహిరంగంగా ఎండగట్టి, ఎలాంటి భయాందోళనలకీ లోనుకాకుండా సురక్షితంగా ఇంటికెళ్ళి విశ్రమించి, మరురోజు సూర్యోదయాన్ని చూడగలగాలి, అంటే బ్రతికుండాలి. అదే ప్రజాస్వామ్యం. అలాంటి ప్రభుత్వాన్నే ఎన్నుకోండి!
ఒక వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలనుకోవడానికి బలమైన కారణం ఒక్కటైనా ఉండాలి. అలాగే ఇంకో వ్యక్తిని వద్దనుకోవడానికీ కూడా అంతే బలమైన కారణం ఒక్కటన్నా ఉండాలి.
కుటుంబ వ్యవస్థలోని తియ్యదనాన్ని ప్రపంచానికి ఇంకా పరిచయం చేస్తూన్న అతి తక్కువ దేశాల్లో మన భారతదేశానిది అగ్రస్థానం. అలాంటి కుటుంబ వ్యవస్థలోని ఏ మైలురాయిని.. అంటే కొడుకు, భర్త, తండ్రి, తాత లాంటి బంధానుబంధాలను వదిలించుకుని.. వాటి ద్వారా సంక్రమించే ఈతిబాధలను, కష్టనష్టాలనుండీ పారిపోయి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న మరో పెద్దమనిషి అధికారమే శాశ్వతం అనుకుంటూ.. మన భావోద్వేగాలతో ఆటాడుకుంటున్నాడు. ఆ ఏడుకొండలస్వామి సాక్షిగా మన జాతికిచ్చిన మాటను ఆయన గుర్తు పెట్టుకోలేదు. అందుకే.. అమరావతి గద్దెనెక్కే MLA లనే కాదు ఢిల్లీ గద్దెనెక్కే MPల ఎన్నిక కూడా మన రాష్ట్రానికి చాలా ముఖ్యం అనేది మనం గుర్తుపెట్టుకుందాం, ఆయన తప్పిన మాటని మనమే సాధించుకుందాం..
ఇప్పటికే విభజన వల్ల ఆంధ్రులం చేతకానివాళ్లమయ్యాం. మాటలు పడ్డాం. మన మీద ఢిల్లీకి జాలి లేకపోయినా దేశమంతా జాలి పడుతోంది. ఇప్పుడు తప్పు చేస్తే దేశం కూడా జాలిపడదు. జాలికి అర్హతలేని జనంలా మిగిలిపోతాం. విచక్షణతో ఓటు వేస్తే చాలు.. ఆ ఓటే మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఈ దేశంలో మన ఉనికిని నిలబెడుతుంది. ఒకప్పుడు దేశం ఉనికి కోసం స్వతంత్రోద్యమం జరిగింది. ఇప్పుడు రాష్ట్రం ఉనికి కోసం ఈ ఎలక్షన్ జరుగుతోంది. కులం, మతం, అభిమానం అన్నీ పక్కన పెట్టండి. మన ఉనికి కోసం, ఆత్మాభిమానం కోసం ఓటెయ్యండి! ఆంధ్రజాతి గౌరవం కోసం ఓటెయ్యండి. ఈ ఎలక్షన్ ఒక ఉద్యమం. ఉద్యమాన్ని వృధా చెయ్యకండి!
తెల్లవారగానే అందరి కంటే ముందే బూతులవద్దకెళ్ళి మీ ఓటుని వినియోగించుకోండి. అంతేగానీ, తాయితీగా వెళ్ళి మీ ఓటుని ఎవరో వేసేశారని తెల్లబోయి తిరిగి రాకండి. ఓటు మీ హక్కు, పోలింగ్ అనేది ఓ ధర్మయుద్ధం. అందులో గెలిచే తిరిగి రండి. తెలుగుజాతి వాడిని, వేడిని, పౌరుషాన్ని, తెగువని ప్రపంచపు నలుమూలలా చాటిచెప్పిన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి శతజయంతి ఉత్సవాలను 2023 సంవత్సరంలో ఘనంగా జరుపబోయే ప్రభుత్వాన్ని సగర్వంగా ఎన్నుకుని రండి..
జోహార్ ఎన్. టి. ఆర్.
జై తెలుగు జాతి,
వందేమాతరం!
About Gopi
Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.
He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.
When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.
He can be reached at gopi@socialnews.xyz