Social News XYZ     

Akhila Bharatha Sobhan Babu Seva Samithi to present Sobhan Babu Awards on December 25th

డిసెంబర్ 25న 'శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో శోభన్ బాబు’ అవార్డ్స్  ప్రదానం 

Akhila Bharatha Sobhan Babu Seva Samithi to present Sobhan Babu Awards on December 25th

మరపురాని నటులు.. ఆంధ్రుల అందగాడు.. కుటుంబకథా చిత్రాల కథానాయకుడిగా ఎవర్గ్రీన్ అనిపించుకున్న నటులు శోభన్ బాబు. నటుడిగా క్రేజ్ ఉండగానే తనకు తానుగా సినిమా జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించుకుని, దాన్ని తూచా తప్పకుండా ఆచరించిన క్రమశిక్షణ కలిగిన ఆయన వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. భౌతికంగా ఆయన దూరమైనా ఆయన అభిమానుల గుండెల్లో ఎప్పుడూ చిరంజీవిగానే ఉన్నారు. సినిమాల నుంచి ఆయన తప్పుకున్నప్పటికీ నేటికీ ఆయన అభిమానులు 'శోభన్ బాబు సేవాసమితి' పేరుతో కార్యక్రమాలను నిర్వహించడం గర్వించదగ్గ విషయం. శోభన్ బాబు మరణానంతరం రాజమండ్రి, విజయవాడ వంటి నగరాల్లో ఆయన కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రతి ఏటా ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. తాజాగా 'శోభన్ బాబు సేవా సమితి' శోభన్ బాబు పేరుపై సినీ పురస్కారాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పురస్కారాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈనెల 25న తొలిసారిగా అవార్డుల ప్రదానోత్సవాన్ని భారీ ఎత్తున హైదరాబాద్ లోని 'ఎన్ కన్వెన్షన్'లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులు, విశిష్ట అతిథులు, గౌరవ అతిథులు హాజరు కానున్నారు.

 

ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను అందించడానికి ఆదివారం హైదరాబాద్ లోని ఎబోనీ హెూటల్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. నటులు, ఎంపీ మురళీమోహన్ గారు, పరుచూరి వెంకటేశ్వరరావుగారు, గోపాలకృష్ణగారు, రేలంగి నరసింహారావుగారు, రాశీ మూవీస్ నరసింహారావుగారు, సంపూర్ణేష్ బాబు గారు, శేష్ట రమేష్ బాబుగారు తదితరులు విచ్చేశారు.

ఈ సందర్భంగా మురళీమోహన్గారు మాట్లాడుతూ.. శోభన్ బాబు గారు గొప్ప వ్యక్తిగా.. నిర్మాతలకు సహకరించిన గొప్ప హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నిత్య చిరంజీవి. ఆయన ఎంత సిన్సియర్ గా ఉండేవారో.. ఆయన అభిమానులు కూడా అదే సిన్సియారిటీని ఫాలో అవుతూ ఇప్పటికీ ఆయన అభిమానులుగానే కొనసాగుతూ ఉన్నారు. మా 'అతడు' సినిమాలో ఆయన్ను నటింప చేయడానికి చాలా ప్రయత్నించాను. బ్లాంక్ చెక్ కూడా పంపాము. అయినా దాన్ని సున్నితంగా తిరస్కరించి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

పరుచూరి వెంకటేశ్వరరావుగారు మాట్లాడుతూ.. అభిమానుల అందరూ కలిసి శోభన్ బాబు గారి పేరిట అవార్డులు నిర్వహిస్తుండడం నిజంగా ఆయనకు నివాళి. ఈ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటున్నాం.

రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. శోభన్ బాబుగారి సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. తన పని ఏదో తాను చూసుకుని సెట్ నుంచే వెళ్లిపోయేవారు. ఎవరి వ్యక్తిగత విషయాల గురించీ వినడానికి ఆసక్తి చూపేవారు కాదు అన్నారు. | దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డిగారు మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమకు మహిళా ప్రేక్షకుల సంఖ్యను పెంచిన ఏకైక కథానాయకుడు శోభన్ బాబు గారు. ఆయన మంచితనాన్ని ఆయన అభిమానులు కొనసాగిస్తుండడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత జె. రామాంజనేయులు మాట్లాడుతూ.. శోభన్ బాబుగారి ఇంటిపక్కనే ఉండేవాళ్లం. ఆయన దగ్గర ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు ఆయన పేరిట ఇస్తున్న అవార్డులకు నా వంతు సాయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు.

సంపూర్ణేష్ బాబుగారు మాట్లాడుతూ.. ఇంతమంది పెద్ద అతిథుల పక్కన నాకు కూడా చోటు కల్పించడం నాకు హ్యాపీగా ఉంది. శోభన్ బాబుగారు వంటి మహెూన్నతమైన వ్యక్తిని నేను కలవలేక పోవడం నా దురదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ అవార్డుల కార్యక్రమంలో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు మొత్తం 19 అవార్డులను ఇస్తున్నాం. ఒకరికి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు, 9 మందికి ఎవర్గ్రీన్ అవార్డులు, 9 ప్రామిసింగ్ అవార్డ్స్ ఇస్తున్నాం. ఇందులో దర్శకుడు, హీరో, హీరోయిన్, నిర్మాత, రైటర్, సినిమాటోగ్రాఫర్, సింగర్, సంగీత దర్శకుడు, కమెడియన్లు ఉంటారు. అవార్డుల ప్రదానోత్సవానికి రెబల్ స్టార్ కృష్ణంరాజుగారు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. | మాజీ ఎమ్మెల్సీ, అఖిలభారత శోభన్ బాబు సేవాసమితి ప్రతినిధి ఎం. సుధాకర్ బాబు మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ కు కొండంత అండగా ఉన్న రామాంజనేయులు గారికి ధన్యవాదాలు. శోభన్ బాబు గారి అభిమానులుగా ఊపిరి ఉన్నంత వరకూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాం. జనవరి 14న కర్నూలులో శోభన్ బాబు జయంతి సందర్భంగా వేలాది మందితో భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నాం. ఈనెల 25న అంగరంగ వైభవంగా ఈ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించ దలిచాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన అందరికీ మా కృతజ్ఞతలు అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో శోభన్ బాబు అభిమానులు రాజమండ్రి నుంచి శ్రీనివాసరావు, కుమార్, గుంటూరు నుంచి జవహర్ బాబు, చీరాల నుంచి బాలసుబ్రహ్మణ్యం, భీమవరం నుంచి శ్రీనివాసరావు, హైదరాబాద్ నుంచి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Facebook Comments
Akhila Bharatha Sobhan Babu Seva Samithi to present Sobhan Babu Awards on December 25th

About uma