Social News XYZ     

Telangana State Film Chamber Of Commerce (TSFC) demands movie theaters be exempted from free parking

పార్కింగ్ ఫీజుల ఫ్రీ నుంచి థియేటర్లను మినహాయించాలి

Telangana State Film Chamber Of Commerce (TSFC) demands movie theaters be exempted from free parking

ఇటీవలే కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఆసుపత్రులు, థియేటర్స్‌లలో పార్కింగ్ ఫీజులను వసూలు చేయవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. వాటి నుంచి సినిమా థియేటర్లను మినహాయించాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.

 

గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ థియేటర్స్, ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే పార్కింగ్ ఫీజుల విషయంలో అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలి. ఒకప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 852 థియేటర్లు ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్య 400లకు చేరుకున్నది. వాటితో పాటు మరో 30 మిల్టీప్లెక్స్‌లలో 130 స్రీన్స్ ఉన్నాయి. అయితే కొన్ని మాల్స్ అధికంగా ఛార్జీలు వసూలు చేయడంతో జీహెచ్‌ఎంసీ ఉత్తర్వుల ప్రకారం పార్కింగ్ ఫీజులు తీసుకోవద్దని ప్రభుత్వం సూచించింది. ఈ నిర్ణయం కారణంగా థియేటర్లపై ఆదనపు భారం పెరిగింది. వాహనాలకు కూడా సరైన రక్షణ కల్పించలేకపోతున్నాం. పార్కింగ్ ఫీజులు ఎత్తేయడంతో ప్రస్తుతం నడుస్తున్న థియేటర్లలో చాలా వరకు మూతపడే అవకాశం ఉంది. థియేటర్లలో పనిచేస్తున్న దాదాపు ఏడువేల మంది ఉపాధిని కోల్పోయారు.పార్కింగ్ ఫీజులపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలి. వాటిని క్రమబద్దీకరించాలి అని తెలిపారు.

టీఎస్‌ఎఫ్‌సీ కార్యదర్శి సునీల్‌నారంగ్ మాట్లాడుతూ పార్కింగ్ ఫీజులను ఎత్తేయడంతో థియేటర్లలో ప్రజల వాహనాలకు భద్రత కరువైంది. పార్కింగ్ ఛార్జీలకు సంబంధించి ప్రభుత్వమే ఒక రేటును నిర్ణయించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో అదే రేటును అమలు చేసేలా చూడాలి. థియేటర్లపై నియంత్రణ పెంచి అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ఎక్కువ ధరలకు అమ్ముతున్న వారికి, తక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్న వారికి ఒకే శిక్ష వేయడం సరికాదు. ఇది మేము తెలంగాణ ప్రభుత్వానికి చేస్తున్న విన్నపం అని తెలిపారు.

టీఎస్‌ఎఫ్‌సీ వైస్ ఛైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వం మా విన్నపాన్ని మన్నిస్తుందని ఆశిస్తున్నాం. 1941లో ఏర్పాటైన తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సంస్థ అని తెలిపారు.

పార్కింగ్ ఫీజులు ఎత్తేయడంతో దానిని అదనుగా భావించి కొందరు ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తున్నారని, రైల్వేస్టేషన్స్, బస్‌స్టాండ్స్‌లలో ఛార్జీలతో పోలిస్తే థియేటర్లలో వసూలు చేస్తున్నది తక్కువేనని, వాటిని ఎత్తేయడం వల్ల థియేటర్ల మనుగడ కష్టమైందని గోకుల్ థియేటర్ యాజమాని అశోక్‌యాదవ్ పేర్కొన్నారు.

1980ల కాలం నుంచి ఈ థియేటర్స్ పార్కింగ్‌ఫీజులను వసూలు చేస్తున్నామని, అది కూడా సాధారణ ఛార్జీలేనని, కావున పార్కింగ్‌ఫీజు ఉచితం నుంచి థియేటర్లను మినహాయించాలని కోరుతున్నామని, పార్కింగ్ ఫీజు ఎత్తేయడం ప్రజలకు మంచిదే కానీ దాని వల్ల థియేటర్లపై పడే భారాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని బాలగోవింద్ రాజ్ తాండ్ల పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు జెమిని కిరణ్, పాటు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ప్రతినిధులు మల్లారెడ్డి, నాగేంద్రరావు, సదానంద్‌గౌడ్, చారి, సిరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Facebook Comments
Telangana State Film Chamber Of Commerce (TSFC) demands movie theaters be exempted from free parking

About uma