
‘కోర్ట్’ సినిమాతో ఆకట్టుకున్న హర్ష్ రోషన్.. ఆ తర్వాత కూడా యూత్‌ఫుల్ కథలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఇప్పుడు నక్షత్రతో కలిసి ‘తెల్లకాగితం’లో నటించాడు. కొత్త దర్శకుడు రమేష్ బండ్రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీనేజ్ వయసులో తెలియక చేసే తప్పులు, వాటి ప్రభావం, కుటుంబ బంధాలు, ప్రేమ వంటి అంశాలను కలిపి ఈ సినిమాను రూపొందించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథ, కథనం ఎలా సాగాయి? చూద్దాం.
కథ:
రాము (హర్ష్ రోషన్) తల్లిదండ్రులను కోల్పోయి అన్నా వదినల సంరక్షణలో పెరుగుతున్న కుర్రాడు. పదో తరగతిలో తన సహ విద్యార్థిని ఆశ (నక్షత్ర)తో పరిచయం ప్రేమగా మారుతుంది. రాము ప్రేమను ఆశ కూడా అంగీకరిస్తుంది.
తెలిసీ తెలియని వయసులో ఇద్దరూ కొన్ని తప్పటడుగులు వేస్తారు. ఆ నిర్ణయం వారి జీవితాల్లో ఊహించని మార్పులకు కారణమవుతుంది. తమ సమస్యలను కుటుంబ సభ్యులకు తెలియకుండా పరిష్కరించుకోవాలని ప్రయత్నించే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వారి జీవితాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఏంటి? తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసినప్పుడు వారి స్పందన ఎలా ఉంది? రాము, ఆశ తీసుకున్న నిర్ణయాలు చివరకు ఎలాంటి పరిస్థితులకు దారితీశాయి? వారి ప్రేమకథ ఎలాంటి ముగింపుకు చేరింది? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
టీనేేజ్ వయసులో తీసుకునే నిర్ణయాలు జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశాన్ని ‘తెల్లకాగితం’ ప్రధానంగా తీసుకుంది. మనసు అనే తెల్లకాగితంపై ఆ వయసులో రాసుకునే నిర్ణయాలు, అనుభవాలు భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయనే ఆలోచనను కథలో చూపించే ప్రయత్నం చేశారు.
అమాయకమైన అబ్బాయి, అమ్మాయి మధ్య పరిచయం.. ప్రేమగా మారే విధానంతో సినిమా ఆరంభం ఆసక్తికరంగా సాగుతుంది. హీరో, హీరోయిన్ పరిచయ సన్నివేశాలు, వారి మధ్య ప్రేమ చిగురించే సందర్భాలు సహజంగా అనిపిస్తాయి. దీనికి తోడు పాటలు కూడా యూత్‌ఫుల్‌గా ఉండటం సినిమాకు ప్లస్‌గా నిలుస్తుంది.
కథలో అసలు సంఘర్షణ మొదలైన తర్వాత సినిమా మరో కోణంలోకి వెళ్తుంది. టీనేజ్‌లో తెలియక చేసే తప్పుల గురించి ప్రేక్షకులు ఆలోచించేలా కథను మలిచారు. కొన్ని సన్నివేశాలను దర్శకుడు అప్పటి కాలానికి అనుగుణంగా అమాయకత్వాన్ని ప్రతిబింబించేలా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు.
ముఖ్యంగా చిన్న వయసులో తీసుకునే నిర్ణయాల విషయంలో అవగాహన ఎంత అవసరమో చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల బాధ్యత, పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాల్సిన అవసరం వంటి అంశాలను కూడా కథలో టచ్ చేశారు.
సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నప్పటికీ.. క్లైమాక్స్ లో ఇచ్చే సందేశం సినిమాకు బలంగా నిలుస్తుంది. క్లైమాక్స్ ద్వారా ప్రేక్షకులను ఆలోచింపజేసే ప్రయత్నం చేశారు.
నటీనటులు:
హర్ష్ రోషన్ రాము పాత్రలో సహజంగా కనిపించాడు. టీనేజ్ కుర్రాడి అమాయకత్వం, ప్రేమ, అయోమయం వంటి భావాలను తన హావభావాలతో చక్కగా చూపించాడు. పాత్రకు అవసరమైన ఎనర్జీని చూపించాడు.
నక్షత్ర ఆశ పాత్రలో ఆకట్టుకుంది. ఇది ఆమెకు తొలి చిత్రం అయినప్పటికీ కొత్త నటిగా అనిపించకుండా సహజమైన నటనతో మెప్పించింది. అమాయకత్వంతో కూడిన పాత్రను చక్కగా పోషించింది. సినిమాలో ఆమె నటన ప్రత్యేకంగా నిలుస్తుంది.
అజయ్... మెడికల్ స్టోర్ మూర్తిగా ఆకట్టుకున్నాడు. హీరో స్నేహితుడి పాత్రలో నటించిన కుర్రాడు కూడా తన పరిధి మేరకు మెప్పించాడు. శరణ్య ప్రదీప్ వదిన పాత్రలో సహజంగా నటించింది. రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం:
సాంకేతికంగా ‘తెల్లకాగితం’ ఉన్నతంగా ఉంది. విజయ్ బుల్గానిన్ అందించిన పాటల్లో రెండు పాటలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు తగ్గట్టుగా సాగుతుంది.
కె.వి. గుహన్ కెమెరా పనితనం బాగుంది. గ్రామీణ నేపథ్యాన్ని, పాత్రల భావోద్వేగాలను విజువల్స్‌లో చక్కగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.
రచయిత నందు సవిరిగాన ఎంచుకున్న పాయింట్ సమాజానికి అవసరమైన సందేశాన్ని అందించేలా ఉంది. టీనేజ్‌లో తెలియక చేసే తప్పులు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని చెప్పడమే కథలో ప్రధాన ఉద్దేశం. దర్శకుడు రమేష్ బండ్రెడ్డి ఈ కథను తనదైన శైలిలో తల్లిదండ్రులకు, యూత్ కు మెసేజ్ ఇచ్చేలా తెరకెక్కించారు.
ప్లస్ పాయింట్స్:
టీనేజ్ లవ్ స్టోరీ
మంచి సందేశం
హర్ష్ రోషన్ నటన
నక్షత్ర సహజమైన పెర్ఫార్మెన్స్
ఆకట్టుకునే రెండు పాటలు
కుటుంబ భావోద్వేగాలు
ఆలోచింపజేసే క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం
సెకండాఫ్‌లో ఇంకాస్త వేగం ఉంటే బాగుండేది
చివరగా:
‘తెల్లకాగితం’ కేవలం టీనేజ్ ప్రేమకథగా కాకుండా.. ఆ వయసులో తీసుకునే నిర్ణయాలు జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసిన సినిమా. హర్ష్ రోషన్, నక్షత్రల సహజమైన నటన, యూత్‌ఫుల్ లవ్ ట్రాక్, కుటుంబ భావోద్వేగాలు, చివర్లో వచ్చే సందేశం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. టీనేజ్ లవ్ స్టోరీస్‌తో పాటు మంచి సందేశం ఉన్న సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘తెల్లకాగితం’ ఒకసారి చూడదగ్గ అనుభూతిని అందిస్తుంది. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.