Categories: MoviesSouth Cinema

“He spoke about me… and gave me a hug. I can never forget that moment.” — Latish, actor from ‘Thimmarajupa lli TV’

నా గురించి చెప్పి.. నన్ను హగ్ చేసుకున్నారు. ఆ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను - ‘తిమ్మరాజుపల్లి టీవీ’ నటుడు లతీష్

‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రానికి మంచి విజయం దక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో కిరణ్ అబ్బవరం దాదాపుగా 50 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తెరకు పరిచయం చేశారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో సిద్ధయ్యగా నటించిన యాక్టర్ లతీష్ మంచి పేరుని సంపాదించుకున్నారు. తనకు దక్కిన ఈ మొదటి విజయం గురించి చెబుతూ తన సంతోషాన్ని పంచుకున్నారు. అతను చెప్పిన సంగతులు ఇవే..

మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి?
నగరిలో మాది వ్యవసాయ ఆధారిత నిరుపేద కుటుంబం. ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజులున్నాయి. మమ్మల్ని మా అమ్మనాన్న, అన్నయ్య కష్టపడి చదివించారు. నేను సినిమాల్లోకి వచ్చానని మా అన్నయ్య నాతో మాట్లాడటం మానేశాడు. కానీ ఈ సినిమా చూసి, అందులో నా పర్ఫామెన్స్ చూసి మాట్లాడాడు. ఈ ప్రయాణంలో నాకు ఎప్పుడూ కూడా అండగా నిలబడిన వారిలో అక్క చాముండేశ్వరి, మామ కోటేశ్వరరావు ముందుంటారు.

 

మీ సినిమా ప్రయాణం గురించి చెప్పండి?
బెంగళూరులో కొన్ని రోజులు ఉద్యోగం చేశాను. 2017లో హైదరాబాద్‌కి వచ్చాను. అప్పటి నుంచే సినిమాల్లో నటించాలని ప్రయత్నించాను. అందరూ నా యాక్టింగ్ బాగానే ఉందని అంటూ చెప్పారు. కానీ ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. మహిపాల్ గారి వద్ద కొన్ని రోజులు అసిస్టెంట్‌గా పని చేశాను. ఆ తరువాత కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. ఆ టైంలో యూట్యూబ్‌లోనే ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి యాక్ట్ చేశాను. మళ్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పని చేశాను.

ఈ జర్నీలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి?
షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు చాలా కష్టాలు పడ్డాను. ఆ టైంలో కెమెరా కొనేందుకు ఇంట్లో వాళ్లనే డబ్బులు అడిగాను. నిర్మించేందుకు డబ్బులు పెట్టేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. నాకు ఏ అసోసియేషన్‌లోనూ మెంబర్ షిప్ లేదు. వేరే డైరెక్టర్ మీద ఆ కథను రిజిష్టర్ చేయించాను. నిర్మాత కూడా నన్నే డబ్బులు అడిగాడు. ఆ తరువాత నేను డా. షేక్ జాన్ బషీర్ గారి వద్ద ట్రైనింగ్ తీసుకున్నాను.

బీ స్టూడియోలో మీ జర్నీ గురించి చెప్పండి?
బీ స్టూడియోలో యాక్టింగ్ కోర్స్ కోసం లక్ష రూపాయలు అడిగారు. డబ్బులున్న వాళ్లకే ఈ యాక్టింగ్ అని నేను ధీనంగా అడిగాను. వెంటనే నా దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా నా కమిట్మెంట్‌ను చూసి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడే నేను పదుల సంఖ్యలో నాటకాలు వేశాను. ఆ నాటకాలు వేస్తున్నప్పుడే ‘తిమ్మరాజు పల్లి టీవీ’ అసోసియేట్ డైరెక్టర్స్ చూశారు. అక్కడే మా అందరినీ చూసి ఆడిషన్స్ తీసుకున్నారు.

విలన్‌గా నటించడం ఎలా అనిపించింది?
ఒకప్పుడు విలన్‌గా నటించిన వారు ఆ తరువాత కాలంలో పెద్ద హీరోలుగా మారారు. నాకు కూడా విలన్ పాత్ర అని చెప్పడంతో ఆ స్టార్స్ అంతా గుర్తుకు వచ్చారు. సినిమాకి హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ మూవీ కోసం వెయిట్ పెరిగాను. ఏకంగా ముప్పై కిలోలు పెరిగాను. సిద్దయ్య పాత్రకు సరిపోవాలని చాలా శ్రమించాను. సినిమా చూసిన వారంతా అది నువ్వేనా? అని అడుగుతుంటే నాకు ఎంతో సంతోషంగా, సంతృప్తిగా అనిపించింది.

ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన ప్రశంసల గురించి చెప్పండి?
కిరణ్ అబ్బవరం అన్న సినిమా చూసిన తరువాత టీం అందరినీ మెచ్చుకున్నారు. అందులో మరీ ముఖ్యంగా ప్రదీప్ అన్నని, నన్ను ఎంతో ప్రశంసించారు. బయట ఇంత సైలెన్స్‌గా ఉన్నావ్.. స్క్రీన్ మీద అలా కనిపించావ్ ఏంట్రా అని ఆశ్చర్యపోయారు. అద్భుతంగా చేశావ్ అని కిరణ్ అన్న మెచ్చుకున్నారు. నరేష్ అగస్త్య గారు కూడా చాలా పొగిడారు. మా బషీర్ సార్ కూడా నన్ను చాలా మెచ్చుకున్నారు. నలుగురు శిష్యులు ఒకే సినిమాలో నటించడంతో బషీర్ సార్ కూడా సంతోషించారు. ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లిన తరువాత నా గురించి చెప్పి.. నన్ను హగ్ చేసుకున్నారు. ఆ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను.

ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్, చేస్తున్న పని ఏంటి?
బీ స్టూడియోలో పార్ట్ టైంగా పని చేస్తున్నాను. చాలా మంది నుంచి ఫోన్స్ వస్తున్నాయి. చాలా కథలు వింటున్నాను. కానీ ఇంత వరకు ఏదీ క్లారిటీ రాలేదు. త్వరలోనే అన్నీ ఓ కొలిక్కి వచ్చేలా ఉన్నాయి.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share