Thanks To Trivikram For Giving All Of Us Life Allu Arjun At Ala Vaikunthapurramloo Thanks Meet

డైరెక్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ. మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్
- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

డైరెక్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ. అలాంటి మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రం గారికి థాంక్స్. ఇది మా హ్యాట్రిక్ కాంబినేషన్. నాకు అర్థమవుతోంది.. ఇది మా కలయికలో ఒక కామా మాత్రమే." అని చెప్పారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఆయన నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా జనవరి 12న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్స్‌తో సంక్రాంతి విజేతగా నిలిచింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ, సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచేందుకు దూసుకుపోతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం థాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా.. హర్షవర్ధన్ మాట్లాడుతూ "ఒక ప్రేక్షకుడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నా. దేవుడు ఎదురుపడితే కోరుకోవడానిక్కూడా భయపడేంత గొప్ప సక్సెస్ ఈ సినిమాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటిదాకా త్రివిక్రమ్ చేసిన సినిమాల్లో ఆయన ప్రతిభ కనిపిస్తే, ఈ సినిమాలో ఆయన దమ్ము కనిపించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా చూపించారని యు.ఎస్. నుంచి ఫ్రెండ్స్ ఫోన్లు చేసి చెప్పారు. బన్నీ సినిమా సినిమాకీ ఎదుగుతున్నారు. ఈ మూవీలో అతను చేసిన పర్ఫార్మెన్స్ అద్భుతం" అన్నారు.

నవదీప్ మాట్లాడుతూ "మాకు సంక్రాంతి నిన్నే వచ్చేసింది. బన్నీతో పదిహేనేళ్ల ఫ్రెండ్‌షిప్‌లో నేను గమనించింది, తనకున్న బ్యాగ్రౌండ్‌ని అడ్వంటేజ్‌గా కాకుండా రెస్పాన్సిబిలిటీగా ఫీలయ్యే చాలామంది తక్కువ హీరోల్లో తనొకడు. ఒకరోజు గీతా ఆర్ట్స్ ముందు నుండి వెళ్తుంటే బయట చాలామంది ఉన్నారు. ఆరోజు బన్నీ పుట్టినరోజు కాదు, శిరీష్ పెళ్లి కూడా కాదు.. ఎందుకు ఇంతమంది ఉన్నారని చూస్తే, ప్రతి శుక్రవారం బన్నీతో ఫొటోలు దిగడానికి ఫ్యాన్స్ వస్తారని తెలిసింది. ఇంకెవరన్నా చేస్తారో, లేదో నాకు తెలీదు కానీ తను ప్రతివారం ఫ్యాన్స్ కోసం ఒకట్రెండు గంటలు కేటాయిస్తాడు. తనకు వచ్చిన గ్యాప్‌ని కసిగా ఎలా మలచుకున్నాడనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. బన్నీలో ఉన్న తపనలో ఒక్క శాతమన్నా అందరిలో ఉంటే బాగుంటుంది. ఈ సంవత్సరం నన్ను గీతా ఆర్ట్స్ వాళ్లు దత్తత తీసుకున్నారు. మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా ఈ బ్యానర్‌లో చేస్తున్నా. అవేమిటన్నది అరవింద్ గారు తర్వాత చెప్తారు" అని తెలిపారు.

రామ్-లక్ష్మణ్ మాట్లాడుతూ "మనిషికి గెలిస్తే ఓడిపోతానేమోననే భయం ఉంటుందంట. ఓడితే గెలుస్తానన్న ధైర్యం ఉంటుందంట. 'నా పేరు సూర్య' ఓటమి ఈరోజు గెలుపుకు కారణమని అల్లు అర్జున్‌కు మనస్ఫూర్తిగా చెబుతున్నాం. 'అజ్ఞాతవాసి' తర్వాత.. ఏదో నేర్పడానికోసమే ఓటమనేది వస్తుందని త్రివిక్రం గారి వద్ద మేం తెలుసుకున్నాం. ఈ సినిమాలో ఫైట్స్ ఇంత బాగా రావడానికి కారణం మా ఫైటర్స్ కూడా. ఈ పండక్కి అన్ని సినిమాలూ మీవే అని అంటుంటే చాలా ఆనందం వేసింది. ఈ క్రెడిట్ మొత్తం మమ్మల్ని కన్న తల్లిదండ్రులకి, మాకు ఈ విద్య నేర్పిన రాజు మాస్టర్‌కి, చదువు సంధ్యలు లేని మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన కళామతల్లికి, మాకు ఈ శక్తినిచ్చిన భగవంతుడికి చెందుతుంది. ఒక మంచి శిష్యుడుంటే గురువుకి అందం, ఒక మంచి బిడ్డ ఉంటే తండ్రికి అందం. గొప్ప బిడ్డ ఉండటం అరవింద్ గారికి అందం. త్రివిక్రమ్ గారు మంచి మనసున్న డైరెక్టర్" అని చెప్పారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ సరదాగా "రాములో రాములా పాట హిట్టయ్యిందంటే కారణం బన్నీ అనుకుంటున్నారు. కాదు" అని తనేనన్నట్లు సైగ చేశారు. "నాకు గుండెకు సంబంధించి అనారోగ్యం కలిగినప్పుడు నన్ను పలకరించడానికి వచ్చాడు మిస్టర్ బన్నీ. 'అంకుల్.. మీరు పర్ఫెక్టుగా ఉన్నారు.. రెస్ట్ తీసుకున్నాక మొట్టమొదట నా సినిమాలోనే మీరు చేస్తున్నారు' అని చెప్పాడు. ఏదో ఎంకరేజ్ చెయ్యడం కోసం చెప్పాడేమో అనుకున్నా. తర్వాత త్రివిక్రమ్ గారొచ్చారు. కొంచెం సేపు మాట్లాడుకున్నాక 'సార్.. మనం కలుస్తున్నాం.. వదిలెయ్యండి ' అన్నారు. వదిలెయ్యమన్నాడు కాబట్టి నేనూ వదిలేశా. సినిమా అయిపోవచ్చింది. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలీదు.. ఈ సినిమాలో ఎలాగైనా బ్రహ్మానందం కనిపించాలని నాకు క్యారెక్టర్ ఇచ్చారు. మాట ఇచ్చి నిలబెట్టుకొనే వ్యక్తుల్లో ఈ ఇద్దరూ ఉంటారు. ఈ గుణం బన్నీకి మా గురువుగారు అల్లు రామలింగయ్య గారి నుంచి వచ్చింది. అన్నేళ్లు ఆయన ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా గడిపారు. నిబద్ధతతో ఉండే అద్భుత నటుడాయన. ఆయనను అద్భుతంగా ప్రేమించి, అభిమానించి, గౌరవించిన వ్యక్తి ఆయన కుమారుడు అరవింద్ గారు. 'మా నాన్న ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉంటాను. ఇష్టమైతే నన్ను పెళ్లిచేసుకో, లేకపోతే లేదు' అన్నాడు బన్నీ తన భార్యతో. దటీజ్ బన్నీ. నటుడిగా చెప్పాలంటే అతను ప్రూవ్డ్ ఆర్టిస్ట్. ఏ మనిషికీ ఊరికే పేరు రాదు, ఊరికే గొప్పవాడు కాడు. దాని వెనుక అతని కృషి వుంటుంది. అలాంటి సామర్థ్యమున్న నటుడు బన్నీ. రచయితగా త్రివిక్రమ్ గురించి చెప్పడం జగమెరిగిన బ్రాహడికి జంధ్యమేల.. అన్నట్లుంటుంది. మా కమెడియన్స్ అందరికీ ఆయన దగ్గరివాడు. తమన్ అద్భుతమైన ట్యూన్స్ కట్టాడు. ఈ సంక్రాంతి పండగ నుంచి ఉగాది పండగ వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది. తప్పదు" అని చెప్పారు.

సునీల్ మాట్లాడుతూ "త్రివిక్రమ్ కు లక్ష్మీ బాంబులు, చిచ్చుబుడ్లు, మతాబులనేవి ఇష్టముండదు. వేస్తే అణుబాంబు వేస్తాడు. అందుకే న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకొని వచ్చాడు. గ్రేట్ థింగ్స్, సింపుల్, యాక్షన్ స్పీక్స్ మోర్ దేన్ వోర్డ్స్ అనేందుకు నిదర్శనం 'అల వైకుంఠపురములో'. పాతికేళ్ల క్రితం నన్ను దత్తత తీసుకున్న త్రివిక్రమ్ ఇప్పటికీ నాకు క్యారెక్టర్లు ఇస్తూ వస్తున్నాడు. ఒక డ్యాన్స్ బిట్‌తో, డైలాగ్స్‌తో అందరిలోకీ నేను వెళ్లాను. ఈ సంక్రాంతికి మలయాళంలోనూ నేను ఆర్టిస్టుగా పరిచయమయ్యాను, ఈ సినిమాతో. పదేళ్ల తర్వాత ఈ సినిమాతో సంక్రాంతికి మీముందుకు వచ్చినందుకు హ్యాపీగా ఉంది. నవదీప్ లాగానే నేను కూడా దత్తతకు రెడీగా ఉన్నానని అరవింద్ గారికి తెలియజేసుకుంటున్నా. అల్లు రామలింగయ్యగారితో కలిసి నటించే అదృష్టం నాకు దక్కింది" అన్నారు.

తనికెళ్ల భరణి మాట్లాడుతూ "ప్రస్తుతానికి ఇది అల మాత్రమే. తర్వాత ఇది ఉధృతంగా సముద్రమవుతుందని ఆ ఛాయలు మనకు తెలిసిపోతున్నాయి. ముందుగా 'అల వైకుంఠపురములో' అనే టైటిల్ పెట్టినందుకు, ఆ సారస్వతానికీ, ఆ లాలిత్యానికీ త్రివిక్రమ్ కు నమస్కారం చేస్తున్నా. వైకుంఠపురం ఆవల ఒక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఒక ఆటల తాంత్రికుడు బన్నీ, ఒక పాటల యాంత్రికుడు తమన్ ఉంటారు. ఈ సినిమాకి వెన్నెముక తమన్. ఈ సినిమా గొప్ప అనుభూతిని పంచింది. బన్నీ అలవోకగా డాన్సులు చెయ్యడం వెనుక ఉన్న కష్టం తెలిసింది" అని చెప్పారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "నలభై రెండు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ పండగలాగే రెండు సినిమాలతో మీ ముందుకు రావడం సంతోషం. 'జులాయి' నుంచి ఇదే కంపెనీ, ఇదే హీరో, ఇదే డైరెక్టర్.. ఇప్పుడు అల్లు అరవింద్ గారు జాయినయ్యారు. ఇలాంటి సినిమాలో రాజేంద్రప్రసాద్ ఉండాలి. జీవితంలో మేం జంధ్యాల గారిని కోల్పోతే, భగవంతుడు మాకిచ్చిన మరో వరం త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా సంథింగ్ స్పెషల్. ఇది మ్యూజికల్ హిట్. మా స్నేహితుడైన డ్రమ్స్ శివకుమార్ కొడుకు తమన్ ఇంత క్లాసీ మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు నేనే చాలా గర్వపడుతున్నా. అందరం ఒక ఫ్యామిలీలా పనిచేశాం. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ సంథింగ్ స్పెషల్ ఫర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఇది నా జీవితంలో అతిపెద్ద పండగ" అని చెప్పారు.

సుశాంత్ మాట్లాడుతూ "నిజంగా ఈ జర్నీలో చాలా చాలా నేర్చుకున్నా. బన్నీ కెరీర్లోని బెస్ట్ పర్ఫార్మెన్స్‌లో ఇదొకటి. చాలా మెచ్యూర్డ్‌గా నటించాడు. 'బుట్టబొమ్మ' అన్న దానికి పూజ సరిగ్గా సరిపోయింది. ఈ సినిమా నాకిచ్చిన ఎనర్జీతో ఈ నెలాఖరుకి ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నా" అన్నారు.

తమన్ మాట్లాడుతూ "త్రివిక్రమ్ గారి రైటింగ్‌ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ సినిమా విషయంలో నాపై చాలా బాధ్యతలు ఉన్నాయనిపించింది. త్రివిక్రమ్ ప్రతిరోజూ కొత్తగా కనిపిస్తారు. బన్నీ గ్రేట్ డాన్సర్. అతనితో తొలిసారి 'రేసుగుర్రం'కు పనిచేశాను. అతను చేసే హార్డ్‌వర్క్ అసాధారణం. లెజెండ్స్ ఉన్న ఇండస్ట్రీలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నా. లావుగా ఉన్న నన్ను పరిగెత్తించి గెలిపించింది. ఈ సినిమా నిజంగా గెలిచింది" అని తెలిపారు.

పూజా హెగ్డే మాట్లాడుతూ "ఈ సినిమాతో త్రివిక్రమ్ గారికి పెద్ద ఫ్యాన్ అయ్యాను. దర్శకునిగానే కాకుండా ఒక వ్యక్తిగా కూడా ఆయనకు అభిమానిగా మారాను. ఆయన గురూజీ అంతే. హారిక అండ్ హాసిని వంటి బ్యానర్‌లో రెండో సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అల్లు అరవింద్ గారు సెట్‌కి వచ్చారంటే ఒక వెలుగు వచ్చినట్లుంటుంది. ఆయన బేనర్‌లో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా. తమన్ ఇవాళ బిగ్ స్టార్ అయిపోయాడు. మెసేజెస్‌కు కూడా రెస్పాండ్ కానంత బిజీ స్టార్ అయ్యాడు. ఈ సినిమాకు ఆత్మనిచ్చాడు. అతనికి గోల్డెన్ పిరియడ్ నడుస్తోంది. రాం-లక్ష్మణ్ ప్రతి సినిమాకీ కొత్తగా ఫైట్లు ఇస్తుంటారు. వాళ్లు స్టైలిష్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు. అల్ల్లు అర్జున్‌తో నన్ను రిపీట్ చేసిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. 'డీజే' చేసినప్పట్నుంచీ బన్నీకి అభిమానినయ్యాను" అని తెలిపారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ "మా కుటుంబం ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తెలుగు కళామతల్లికి ఒక రూపమిస్తే, ఆమె కాళ్లదగ్గర సేదతీర్చుకుంటున్న కుటుంబం మేం. అల్లు రామలింగయ్య గారి నుంచి మా అబ్బాయిల దాకా.. ఇన్నేళ్ల నుంచీ మమ్మల్ని ఆశీర్వదిస్తూ వస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. త్రివిక్రమ్ గారు మాకు కథ చెప్పినప్పుడు సింపుల్ కథే అనిపించింది. కానీ తన స్క్రీన్‌ప్లేతో గొప్పగా తీర్చిదిద్దారు త్రివిక్రమ్. రషెస్ చూసి బన్నీ అలవోకగా ఆ క్యారెక్టర్ చేసిన విధానానికి ఆశ్చర్యపోయా. కానీ దానివెనుక ఉన్న కృషి నాకు తెలుసు. కలెక్షన్స్ పరంగా చూస్తే.. బన్నీ బెస్ట్, త్రివిక్రం బెస్ట్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీ బెస్ట్స్‌లో ఒకటవుతుందని చెప్పగలను" అని చెప్పారు.

దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ "సినిమాలో చున్నీ ఫైట్‌తోటే షూటింగ్ మొదలుపెట్టాం. అలా రాం-లక్ష్మణ్ మాస్టర్స్‌తో మొదలుపెట్టాను. వాళ్లతో ప్రయాణం నాకొక తాత్విక ప్రయాణం. ఈ సినిమాకు సంబంధించి రెండు విషయాలు దాచాను. 'సిత్తరాల సిరపడు' అనే శ్రీకాకుళం యాసతో నడిచే ఒక పాటని రాం-లక్ష్మణ్ మాస్టర్లతో కొరియోగ్రఫీ చేయించాను. దానికి వాళ్లు ఫైట్ చెయ్యలేదు. అందులోని ప్రతి లిరిక్‌ని అర్థం చేసుకొని ఒక కవితలాగా దాన్ని తీశారు. ఒక కొత్త ప్రయోగాన్ని నేను అనుకున్న దానికన్నా అందంగా తీశారు. ఆ పాటను ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితమిస్తున్నాం. దాన్ని విజయకుమార్ రాస్తే, తమన్ మంచి ట్యూన్స్ కట్టాడు. అలాగే 'రాములో రాములా' పాటలో బ్రహ్మానందం గారిని ఉపయోగించుకున్నాం. మామీదున్న వాత్సల్యంతో ఆయన దాన్ని చేశారు. ఆయన సినిమాలో ఉన్న విషయాన్ని దాచిపెట్టడం చాలా కష్టమైంది. మొత్తానికి ఏనుగుకు విడుదల కలిగించాం. తనికెళ్ల భరణి నా మొదటి సినిమా నుంచీ కనిపిస్తూనే వస్తుంటారు. సునీల్ శక్తి సునీల్‌కు తెలీదు. మేం ఒక రూంలో కలిసున్నప్పుడు వాడు విలన్ అవుదామనుకున్నాడు. నేనేమో తెలుగు ఇండస్ట్రీలోని కామెడీ దిగ్గజాల్లో నువ్వూ ఒక దిగ్గజంగా నిలిచిపోతావని చెప్పా. అఫ్‌కోర్స్.. అప్పట్నుంచీ ఇప్పటిదాకా తను నా మాటల్ని నమ్మడం లేదు. ఎప్పుడు నమ్ముతాడో తెలీదు. పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు వచ్చాక ఇంకో 20 ఏళ్లకు నమ్ముతాడేమో. హర్షవర్ధన్, నేనూ రచయితలుగా జర్నీ మొదలుపెట్టాం. తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లోటు ఉంది. దాన్ని ఆయన పూడుస్తారనేది నా నమ్మకం. 'జులాయి' నుంచి నేను రాజేంద్రప్రసాద్‌తో పడుతూనే ఉన్నాను. ఇంకా ఆయన్ని భరిస్తూనే ఉంటాను. వజ్రం కఠినంగా ఉంటుంది. అలా అని కిరీటంలో పెట్టుకోవడం మానేస్తామా? రాజేంద్రప్రసాద్ కూడా అంతే. సుశాంత్ నన్ను కథ కూడా అడగలేదు. నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంటే వద్దన్నాడు. తను చేసిన పాత్రను నిలబెట్టాడు. పూజ టైంకు వస్తుంది, క్యారెక్టర్‌ను బాగా అర్థం చేసుకుంటుంది, తెలివితేటలున్నాయి, అందంగా ఉంటుంది, అడిగినప్పుడు డేట్లిస్తుంది, ఈతరం అమ్మాయికి ప్రతినిధి కాబట్టే మళ్లీ రెండోసారి ఆమెను తీసుకున్నాను. ఐ రెస్పెక్ట్ హర్. 'నేను నెగ్గేవరకు అయినట్లు కాదు' అనేది తన వాట్సాప్ స్టేటస్. చాలా విషయాలు సినిమాటోగ్రాఫర్ వినోద్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్‌కు వదిలేశా. ఎడిటర్ నవీన్ గ్రేట్ జాబ్ చేశాడు. తమన్ ఇది బాలేదంటే, ఇంకోటి రెడీ చేసేవాడు. అందుకే సామజవరగమన, రాములో రాములా, బుట్టబొమ్మ, ఓ మైగాడ్ డాడీ, అల వైకుంఠపురములో, సిత్తరాల సిరపడు వంటి ఆరు బ్లాక్‌బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమా హిట్టనే ఫీలింగ్‌ని క్రియేట్ చేసిన తొలి వ్యక్తి తమన్. మా అందరి పనినీ సగం తగ్గించేశాడు. మిగతావాళ్లు తనకు మ్యాచ్ చేస్తే చాలన్నట్లు చేశాడు. చినబాబు, అల్లు అరవింద్ ల కుటుంబ సభ్యుడ్ని నేను. మీరు కలగనండి.. మేము రియల్ చేస్తామన్నారు వాళ్లు. ఈ సినిమాకు మొదలు, చివర బన్నీనే. ఇద్దరం బాల్కనీలో ఒక బ్లాక్ కాఫీ తాగుతూ 'అల వైకుంఠపురములో' జర్నీ మొదలుపెట్టాం. అప్పట్నుంచీ మా ఇద్దరికీ ఇదే ప్రపంచం. ఎంతో తపన ఉన్న నటుడు. బన్నీ మంచి డాన్సర్ అనే విషయం అందరికీ తెలుసు. చాలా అసాధరాణ స్టైల్ సెన్స్ ఉన్నవాడు. ఈ విషయం అందరికీ తెలుసు. చాలా గొప్ప నటుడు. ఇది నాకు తెలుసు, ఇంకా కొంతమందికి తెలుసు. అతనిలోని నటన అక్కడక్కడ గ్లింప్సెస్ మాదిరిగా ఇదివరకు కనిపించింది. మొదట్నించీ చివరి దాకా అతనిలోని నటుడు కనిపిస్తే ఎలా ఉంటుంది.. అనే నా కోరిక ఈ సినిమాతో తీరింది. బంటు అనే క్యారెక్టర్‌ను ముందుపెట్టి, తను వెనకాల ఉండటం మామూలు ప్రయోగం కాదు. ప్రతి షాట్‌కూ అతనెంత కష్టపడ్డాడో లొకేషన్లొ ఉన్న మాకు తెలుసు. దాన్ని ఈరోజు మీరందరూ గుర్తించడం నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా చూడగానే ఒన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ టిల్ డేట్ అని అతనికి చెప్పాను. మునుముందు అతను ఇంకా గొప్ప పర్ఫార్మెన్సెస్ ఇస్తాడు. సచిన్‌కు ఫుల్ టాస్ వేస్తె ఏం జరుగుతుందో, ఈ సినిమా బన్నీకి అంతే"

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ "ఈ సినిమాతో ఎంటర్‌టైన్ చెయ్యగలిగే అదృష్టం ఇచ్చిన మొత్తం తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఏడాదిన్నర క్రితం జూలై 26న నేను ట్విట్టర్లో పెట్టిన ఒక మెసేజ్.. మై డియరెస్ట్ ఫ్యాన్స్.. థాంక్యూ ఫర్ ఆల్ ద లవ్. ఐ వాంట్ టు టెల్ ఆల్ ద పీపుల్ టు లిటిల్ పేషెన్స్ అబౌట్ నెక్స్ట్ ఫిల్మ్ అనౌన్స్‌మెంట్. బికాజ్ ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ వైల్ మోర్. ఐ వాంట్ టు జెన్యూన్‌లీ డెలివర్ ఎ గుడ్ ఫిల్మ్. ఇట్ టేక్స్ టైం. థాంక్యూ ఫర్ అండర్‌స్టాండింగ్.. ఇవాళ సినిమా రిలీజైన తర్వాత ఒక వ్యక్తి నాకు పంపిన రిప్లైని భరణిగారు చదువుతారు" అని మైకు భరణికి ఇచ్చారు. భరణి "చెప్పి మరీ బ్లాక్‌బస్టర్ కొట్టాడు.. ఈడు మగాడ్రా బుజ్జీ" అని చదివి మైకు తిరిగి బన్నీకి ఇచ్చారు. బన్నీ కొనసాగిస్తూ "అది నాకు చాలా ఇష్టమైన త్రివిక్రమ్ గారి డైలాగ్. ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులకూ, ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. మీ లవ్ నాకు అందింది. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్‌తో ఇది నా ఫస్ట్ ఫిల్మ్. ఆయనతో కలిసి చాలా సినిమాలు చెయ్యబోతున్నా. నార్త్ ఇండియాలో నేను చేసే ఫైట్లు ఇష్ట పడతారు. నాకొచ్చిన యాక్షన్ ఇమేజ్‌కు కారణం రాం-లక్ష్మణ్ మాస్టర్స్. బ్రహ్మానందం గారు మా తాతయ్య గురించి మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. సునీల్, నేనూ కలిసి చేసిన బోర్డ్ రూం సీన్‌కి థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ అద్భుతం. మా ప్రతి కాంబినేషన్ బ్లాక్‌బస్టర్ అని ఆయన చెప్పిన మాట నిజం. వినోద్ సినిమాటోగ్రఫీ లేకపోతే సినిమాకు ఈ రేంజ్ ఉండేది కాదు. తమన్ మ్యూజిక్‌ని చాలా ఇష్టపడే ప్రేక్షకుడ్ని నేను. మా బావ (నవదీప్) బిగ్ బాస్‌లో ఉన్నా, పబ్‌లో ఉన్నా, షూట్‌లో ఉన్నా, సక్సెస్ పార్టీలో ఉన్నా, ఒక్కడే ఉన్నా, ఒకే వైబ్‌లో ఉంటాడు. హర్ష చాలా బాగా తన క్యారెక్టర్ చేశారు. రాజేంద్రప్రసాద్ గారితో వరుసగా మూడో హిట్టు కొట్టినందుకు హ్యాపీగా ఉంది. కథ వినకుండా ఓకే చేసిన సుశాంత్‌కు ఏదో ఒక స్కోర్ ఉండాలనుకున్నా.. క్లైమాక్స్‌లో 'కొడితే ఫీలవుతారంకుల్' అని చెప్పి నడుస్తుంటే అందరూ క్లాప్స్ కొట్టారు. నేనేం కోరుకున్నానో అది అతనికి వచ్చింది. 'జులాయి'తో హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ మొదలైంది. ఆ తర్వాత 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' చేశాను. పూజతో 'డీజే' చేసేప్పుడు ఈ అమ్మాయి చాలా బాగా చేస్తోంది, ఇంకో సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నా. బేసిగ్గా ఒక హీరోయిన్ని రిపీట్ చెయ్యాలంటే కొంచెం భయపడతాను. నేను 20 సినిమాలు చేశాను కాబట్టి, నేను పాత. కొత్త హీరోయిన్‌తో చేస్తే కొత్తగా కనిపిస్తాననేది నా ఫీలింగ్. అందుకే ప్రతిసారీ కొత్తమ్మాయిని పెట్టుకుంటూ ఉంటాం. కానీ రిపీట్ చేసినా బాగుంటుందనిపించిన మొదటి అమ్మాయి పూజ. ఈ సినిమా చేశాక మరోసారి రిపీట్ చేసినా తప్పులేదనిపించింది. ఎప్పట్నించో ఒక పెద్ద సినిమా పడాలనేది నా కోరిక. దాన్ని క్రియేట్ చేసేదెవరు అనుకుంటూ వచ్చాను. ఒక లార్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక్క త్రివిక్రమ్ గారే మైండ్‌లోకి వచ్చారు. స్క్రిప్ట్ ఈజ్ ద కింగ్ అనే విషయంలో మరో మాట లేదు. ఆయన మైండ్‌సెట్ ఎలా ఉందో తెలుసుకుందామని కలిశాను. జెన్యూన్‌గా, సరదాగా ఒక సినిమా చేద్దామనుకున్నాం. ఆ జెన్యూనిటీకి జనం కనెక్టయ్యారు. నేను ఎన్నిసార్లు డీవియేట్ అయినా ఆయన ధైర్యమిస్తూ వచ్చారు.

డైరెక్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ. మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. మురళీశర్మ నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్. అలాంటి ఆర్టిస్టుకి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో పడటం చాలా ఆనందంగా ఉంది. ఆయన వల్ల నా పర్ఫార్మెన్స్ ఇంకా ఎలివేట్ అయ్యింది. ఒక ఇంటర్వ్యూలో నెపోటిజంపై నా అభిప్రాయం అడిగారు. దేవుడికి ఒక పూజారి కుటుంబం తరతరాలుగా తమ జీవితాన్ని ఎలా అంకితం చేస్తుందో, అలాగే మా కుటుంబం కూడా సినిమాకి మా జీవితాల్ని అంకితం చేసింది. మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, ఇప్పుడు నేను చేస్తున్నా. దీన్ని నెపోటిజం అనుకుంటే అనుకోండి. మేం ప్రజలకు వినోదాన్ని పంచడానికి వాళ్లకు సరెండర్ అయ్యాం" అని చెప్పుకొచ్చారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

Thanks To Trivikram For Giving All Of Us Life Allu Arjun At Ala Vaikunthapurramloo Thanks Meet (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Thanks To Trivikram For Giving All Of Us Life Allu Arjun At Ala Vaikunthapurramloo Thanks Meet (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Thanks To Trivikram For Giving All Of Us Life Allu Arjun At Ala Vaikunthapurramloo Thanks Meet (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Thanks To Trivikram For Giving All Of Us Life Allu Arjun At Ala Vaikunthapurramloo Thanks Meet (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Thanks To Trivikram For Giving All Of Us Life Allu Arjun At Ala Vaikunthapurramloo Thanks Meet (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Thanks To Trivikram For Giving All Of Us Life Allu Arjun At Ala Vaikunthapurramloo Thanks Meet (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Thanks To Trivikram For Giving All Of Us Life Allu Arjun At Ala Vaikunthapurramloo Thanks Meet (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Thanks To Trivikram For Giving All Of Us Life Allu Arjun At Ala Vaikunthapurramloo Thanks Meet (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Thanks To Trivikram For Giving All Of Us Life Allu Arjun At Ala Vaikunthapurramloo Thanks Meet (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Thanks To Trivikram For Giving All Of Us Life Allu Arjun At Ala Vaikunthapurramloo Thanks Meet (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share

This website uses cookies.