Mega Star Chiranjeevi Appreciates Manam Saitam

మనం సైతంకు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసా పత్రం

సేవా సామ్రాజ్యంగా విస్తరిస్తున్న మనం సైతం సంస్థకు అండగా ఉంటానన్నారు మెగాస్టార్ చిరంజీవి. గతంలో సంస్థ సేవా కార్యక్రమాల గురించి తెలిసి....మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ ను ఇంటికి ఆహ్వానించి 2 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన చిరంజీవి...తాజాగా తన స్వదస్తూరితో ప్రశంసా పత్రాన్ని అందజేశారు. తమ్ముడు కాదంబరి మంచి కార్యక్రమం చేస్తున్నాడంటూ ఆ లేఖలో చిరు అభినందించారు. మనం సైతం కార్యక్రమాలను మెగాస్టార్ కు వివరించేందుకు సభ్యులు కాదంబరి కిరణ్, బందరు బాబీ ఆయన ఇంటికి వెళ్లారు. ఇటీవల తాము చేసిన సేవా కార్యక్రమాల గురించి కాదంబరి కిరణ్ చిరంజీవికి చెప్పారు.

ఈ సందర్భంగా కాదంబరి బృందాన్ని మెచ్చుకున్న చిరు...మనం సైతంకు ఎప్పుడు, ఏ సాయం కావాలన్నా చేస్తానన్నారు. తమ్ముడు కాదంబరి కిరణ్ వయసులో చిన్నవాడైనా, మనసులో ఎంతో పెద్దవాడు. ఆపదలో ఉన్నవారిని, అవసరార్థులను అక్కున చేర్చుకుని, నేనుసైతం అంటూ వారికి చేయూత అందివ్వడం, వారికి భరోసాగా ఉండటం, వారికి ఆశాజ్యోతిలా ఉండటం ఎంతో అభినందనీయం. అతను చేస్తున్న ఈ కార్యక్రమానికి అతనితో పాటు మేము సైతం అంటూ మేమంతా ఉంటాం. ఈ సేవా కార్యక్రమంలో అతనికి చేదోడు వాదోడుగా ఉన్న ఆ సంస్థ కార్యవర్గ సభ్యులకు మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఆ భగవంతుడు కాదంబరికి మంచి మనసు ఇవ్వడమే కాదు మంచి భవిష్యత్ ను కూడా ఇస్తాడని ప్రగాఢంగా నమ్ముతూ..ఆశీస్సులతో అన్నయ్య చిరంజీవి...అంటూ ప్రశంసా లేఖలో మెగాస్టార్ చిరు తన వాత్సల్యం చూపించారు. అన్నయ్య ఆశీస్సులు దక్కడంపై కాదంబరి కిరణ్ స్పందిస్తూ....మన సైతం ఒక యజ్ఞంలా సాగిపోతోంది. సాయం కోరిన ప్రతి పేదవారికీ ఆసరాగా ఉంటున్నాం. ఈ గొప్ప కార్యక్రమానికి అన్నయ్య చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి అండ దొరకడం సంతోషంగా ఉంది. ఆయన మరోసారి మా ద్వారా సంస్థ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. మమ్మల్ని అభినందించారు. ఆయన మాటలతో నాతో పాటు మా బృందానికి ఎంతో ధైర్యం కలిగింది. మెగాస్టార్ ఇచ్చిన అండతో మరింత ఉత్సాహంగా మనం సైతంను పేదల పాలిట పెన్నిధి చేస్తాం. అన్నారు.

ఈ కార్యక్రమంలో మనం సైతం సభ్యులు బందరు బాబీ, ఆయన సతీమణి కవిత పాల్గొన్నారు.

Facebook Comments

About uma

Share
More

This website uses cookies.